గత బుధవారం మధ్యాహ్నం ఫరుఖాబాద్లో ఎనిమిదేళ్ల చిన్నారి సీమా సుమారు 60 అడుగుల లోతైన బోరుబావిలో పడింది. బాలికను బయటకు తీసేందుకు సైన్యం, పారామిలటరీ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అయినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. సుదీర్ఘ సమయం సహాయక చర్యల అనంతరం చేతులెత్తేసింది సైన్యం.
వైద్య బృందం ప్లాస్టిక్ పైప్ ద్వారా బాధితురాలికి ఆక్సిజన్ అందించింది. కానీ.. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆక్సిజన్ పైప్ తెగిపోయింది. ఇసుక నేల కారణంగా సొరంగంలోకి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రెస్య్కూ ఆపరేషన్ను అధికారులు నిలిపేశారు. అనంతరం సైన్యం తిరిగి వెళ్లిపోయింది.
రక్షణ చర్యల నిలిపివేతపై తహసీల్దార్ ప్రదీప్ కుమార్ను విలేకరులు ప్రశ్నించగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. అనంతరం.. ఉన్నతాధికారులు రక్షణ చర్యలను నిలిపేయాలని ఆదేశించినట్లు వివరణ ఇచ్చారు.
ఇసుక నేలతోనే సమస్య
బోరుబావి చుట్టు పక్కల ప్రాంతంలో ఇసుక నేల ఉండటం వల్ల సమస్య ఏర్పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గురువారం రాత్రి వరకు సొరంగం చేసుకుంటూ సుమారు 30 అడుగుల లోతులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ రాత్రి 12:15 గంటల సమయంలో వారిపై పెద్ద ఎత్తున మట్టి కూలి ప్రయత్నం విఫలమైంది.
తరచుగా మట్టి కూలిపోవటం వల్లనే రక్షణ చర్యలు నిలిపేశారు అధికారులు. బోరు బావి నుంచి సీమా బయటకి రాకపోవటంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వారిని ఎలా ఓదార్చాలో తెలియక గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు.