దేవతల నేలగా కొనియాడే హిమాచల్ ప్రదేశ్లో అడుగడుగునా అంతు చిక్కని రహస్యాలే.. సోలన్ జిల్లా కునిహర్ సమీపంలోని ద్యార్లో 'శివ తాండవ' గుహ విశిష్టతలు శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపోయేలా చేస్తున్నాయి. నాగేంద్రుడు మోస్తున్నట్లు ఉండే ఆ గుహ ఆకృతి దైవ శిల్పి కూడా చెక్కలేని ఓ అద్భుతమే. ఇక్కడ కొలువైన శివలింగానికి గుహలోని రాళ్ల నుంచి క్షీరాభిషేకం, జలాభిషేకం ఎలా జరుగుతందనేది ఇప్పటికీ ఓ మర్మమే.
పొదుగులాంటి రాళ్లు..
ఇక్కడ గుహ పైభాగం గోవు పొదుగు ఆకారంలో ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం ఆ శిలల్లోంచి ఉత్పత్తయైన పాలు శివలింగంపై పడి నిత్యం అభిషేకం జరిగేది. ఆ తరువాత క్షీరం స్థానంలో నీళ్లు రావడం మొదలైంది. అయితే.. రాళ్లల్లో పాలు, నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పటికీ ఓ ప్రశ్నే.
అందుకే ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఆ పరమేశ్వరుడు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రదేశంలో ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు. ప్రతి సోమవారం వేలాది భక్తులు శివయ్యకు అభిషేకం చేసి ప్రసన్నం చేసుకుంటారు.
శివయ్యను దాచిన గుహ..
సత్యయుగంలో.. భస్మాసురుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతాడు పరమేశ్వరుడు. 'నేను ఎవరి తలపై చేయి పెట్టినా వారు బూడిదైపోవాలి' అలాంటి వరమే నాకివ్వమని కోరాడు అసురుడు. మాట తప్పడం ఎరుగని భోలానాథుడు అలాగే వరమిస్తాడు. కానీ, వరం పొందిన మరుక్షణం ఇచ్చిన వరం పని చేస్తుందా లేదా అని శివయ్య తలపైనే చేయిపెట్టే ప్రయత్నం చేశాడు ఆ రాక్షసుడు. లోకాలనేలే శంకరుడు ఆ క్రూరుడి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. ఆ క్రమంలోనే ఈ గుహలోకి వచ్చి శివుడు తాండవించాడని, తరువాత లింగ రూపంలో ఇక్కడే ఉండిపోయాడని స్థానికుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతం శివతాండవ గుహగా పేరుగాంచింది.
అంతే కాదు.. శివుడిని కాపాడేందుకు ఫణేశ్వరుడు (శేష నాగు) ఈ గుహను తన తలపై మోశాడని.. భస్మాసురుడి కంట పడకుండా తన పడగతో శివుడిని దాచేశాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. చూడడానికి అచ్చం అమరనాథ్ గుహలానే కనిపించే నిర్మాణం.. ప్రకృతి అద్భుతమని.. దేవశిల్పికి సైతం సాధ్యం కానటువంటి ఆకృతిలో ఏర్పాటైందని శివభక్తులు విశ్వసిస్తారు.
ఇదీ చదవండి:'ప్లాస్టిక్ భూతం' వద్దు.. 'జనపనార' ముద్దు!