ఎన్డీఏ అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని బిహార్ ప్రజలు కోరుకుంటున్నట్లు భాజపా నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అందువల్లే వారు మరోసారి ఎన్డీఏను గెలిపించారని అన్నారు. మహాఘట్ బంధన్, ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఓట్ల శాతం స్వల్పంగా ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే, చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ వల్లే ఎన్డీఏ ఓట్లు చీలిపోయాయని, లేకుంటే 135 స్థానాల వరకూ గెలుచుకునేవారమని ఈనాడుకు తెలిపారు.
''బిహార్ చాలాకాలం పాటు సామాజిక వర్గాల అస్తిత్వ రాజకీయాలకు మారుపేరుగా ఉండేది. ఈ దఫా కులాలకు అతీతంగా ప్రజలు ఓటేశారు. అభివృద్ధినే ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించగల సామర్థ్యం ఎవరికుందో వాళ్లు గుర్తించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల నాయకత్వాన్ని విశ్వసించారు. బిహార్‌లో ఇప్పుడు రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఒక ఎయిమ్స్ పనిచేస్తున్నాయి. మరో ఎయిమ్స్ కూడా రాబోతోంది. నిఫ్ట్, ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లను మహిళలు పొందారు. వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే వెళ్తోంది.
రైతులు పీఎం కిసాన్ పథకం ద్వారా ఏటా రూ. 6 వేలు పొందుతున్నారు. లాక్డౌన్లో 8 కోట్ల మంది బిహారీలకు ఉచిత భోజనాలు అందించాయి. ఇవి పేదలను ఆకట్టుకున్నాయి. 15 ఏళ్ల క్రితం నాటి జంగిల్ రాజ్‌లోని కష్టాలను వాళ్లింకా మరవలేదు. అందుకే ఎన్డీఏకు పట్టం కట్టారు.''
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి