గోరఖ్‌పుర్.... ఉత్తర్‌ప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గం. భాజపాకు ఎంతో ప్రతిష్టాత్మకం. ఎందుకంటే... అది ఒకప్పుడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం. 2018 ఉపఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రభావంతో పరాజయం చవిచూసింది కమలదళం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల రూపంలో ఆ సీటును తిరిగి దక్కించుకునే అవకాశం వచ్చింది. విస్తృత కసరత్తు చేసి, సినీ నటుడు రవి కిషన్‌ను రంగంలోకి దింపింది భాజపా.
రవి కిషన్‌కు రాజకీయం కొత్త. అలాంటి వ్యక్తి... గోరఖ్‌పుర్‌లో విజయం కోసం ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారు? గెలిస్తే... అక్కడి ప్రజల కోసం ఏం చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేసింది ఈటీవీ భారత్.
ప్ర- గోరఖ్‌పుర్ నుంచి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు భోజ్‌పూరి సూపర్‌స్టార్ రవికిషన్. ఈ ఎన్నికల్లో ఎలా గెలుస్తారనే విషయంపై ఆయననే అడిగి తెలుసుకుందాం? రవికిషన్.. ఏమంటారు?
జ- బాబా గోరఖ్‌నాథుని నేలపై నుంచి ఈటీవీ భారత్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా గెలుపు అవకాశాలపై ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలంటారు. నేను గోరఖ్‌పుర్‌లో అడుగుపెట్టగానే జనం బ్రహ్మరథం పట్టారు. అసలు ఊహించలేదు. పార్టీకి, మరెవరికీ ఎలాంటి ఏర్పాట్లు చేయమని చెప్పలేదు. రోడ్లపైకి భారీగా ప్రజలంతా స్వయంగా తరలివచ్చారు. ఇదంతా ఆ గోరఖ్‌నాథుని దయ. గురువు గారి దయ. యోగి మహరాజ్ దయ. ప్రజలు ఎంతో ఉత్తేజంతో ఉన్నారు. 2018 ఓటమికి జవాబివ్వాలని కోరుకుంటున్నారు. మే 23న చరిత్ర లిఖించాలని చూస్తున్నారు.
ప్ర- అంటే కూటమి పటాపంచలు అవుతుందా? రవికిషన్ గెలుస్తారా?
జ- హర్ హర్ మహ దేవ్. ఈసారి ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదు. రవికిషన్ విజయం తథ్యం.
ప్ర- సినిమా నటుడైన మీరు ఇప్పుడు నిజమైన రాజకీయ నేత పాత్ర పోషిస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలతో వచ్చారు?
జ- ఎక్కువేం లేదు. ఎక్కువ బుర్ర బద్ధలు కొట్టుకునేది లేదు. మోదీ ఉన్నారు. ముఖ్యమంత్రి యోగి ఉన్నారు. వాళ్లే చూసుకుంటారు. నా పని చౌకీదారీ. దిల్లీ నుంచి ఇదిగో ఇది తీసుకెళ్లు. ప్రజలకు చేరాలి. ఊళ్లో ఇవ్వు. రైతులకు ఇవ్వు. ఫలానా ప్రాంతానికివ్వు. అని మోదీ, యోగి ఆదేశిస్తే నేను చేరుస్తా. అంతే నా పని. ఒక స్టూడియో కోసం పోరాటం చేస్తా. భోజ్‌పురి అభివృద్ధికి కృషి చేస్తా. ఎనిమిదో షెడ్యూల్లో చేర్పించేందుకు పోరాడతా. నాకు తెలిసిన సమస్యలన్నింటిపై పోరాడతా.
ప్ర- గోరఖ్‌పుర్ నుంచి గెలుపొందాక ఇక్కడే ఉంటారా?
జ- ఎక్కడికెళ్తాను? ఎక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను. గోరఖ్‌నాథుని పాదాల చెంత పడి ఉంటాను. ఇక్కడే నాకు సంతోషం. యోగి మహరాజ్ ఈ నగరాన్ని ఎంతో సుందరీకరించారు. విద్యుద్దీపాల కాంతులీనుతోంది గోరఖ్‌పుర్. 7 కోట్ల మంది మహిళలకు మోదీ గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. 50 కోట్ల మందికి 5లక్షల ఆరోగ్య బీమా ఇప్పించారు. అలాంటప్పుడు.. ఈదేశాన్ని, ఈ గోరఖ్పుర్ను వదిలి ఎక్కడికెళ్తాను.
మోదీ అంటే నా దృష్టిలో ఓ లిట్టీ చోఖా వంటకం. ఈటీవీ భారత్ మాధ్యమం ద్వారా 30 కోట్ల మంది భోజ్‌పురి జనాభాకు నా విన్నపం.. మన గడ్డ నుంచే(యూపీ, పూర్వాంచల్) ప్రధాని ఎన్నికవుతారు. అంతటి శక్తిమంతమైన నేల మనది. మనమంతా మోదీ గురించి కాస్త ఆలోచించాలి. మోదీ అంటే ఓ పెద్ద లిట్టీ చోఖా. ఇతర విపక్షాలు కట్లెస్, కేక్, పిజ్జా, బర్గర్ లాంటి వాళ్లు.
ప్ర-ఇవన్నీ చేసినా మోదీని విపక్ష నేతలు నిందిస్తున్నారంటారా?
జ- వాళ్లంతా పిచ్చోళ్లయ్యారు. మే 23 తర్వాత వాళ్లంతట వాళ్లే వెళ్లి పిచ్చాసుపత్రిలో చేరుతారు. వాళ్ల కార్యకర్తలూ గందరగోళంలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితిని వారు అసలు ఊహించలేదు. వాళ్ల నేతనే పార్లమెంటులో మోదీ మరోసారి ప్రధాని కావాలి అంటున్నారు.
ప్ర- భోజ్‌పురి నటుడిగా మీకు ఎనలేని గుర్తింపు ఉంది. భోజ్‌పురి కోసం ఏంచేస్తారు?
జ- భోజ్‌పురిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలి. తిరిగి గంగా నది ప్రవాహంలా పునరుత్తేజింపజేయాలి.