మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొన్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్. భాజపాతో మైత్రిలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు రౌత్.
ఈ సమయంలో ట్విట్టర్లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో ఉన్న చిత్రం పోస్ట్ చేస్తూ.. విజయం సాధిస్తున్నట్లు పేర్కొవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"విజయానికి ముందు పడిన కష్టం ఎంతో మజాను ఇస్తుంది. జైహింద్."
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. 'జైహింద్' అంటూ అభిమానులను పలకరించారు రౌత్. సాధారణంగా 'జై మహారాష్ట్ర' నినాదాన్నే శివసేన ఉపయోగిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు 170 మంది మద్దతు ఉందని శనివారం ప్రకటించారు రౌత్. ఈ ప్రకటన తర్వాత గవర్నర్ను సంజయ్ రౌత్ కలవనుండటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.
దిల్లీకి చేరిన 'మహా' రాజకీయాలు..
శివసేన సంచలన ప్రకటన నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు రాజధాని దిల్లీకి చేరాయి. భాజపా అధ్యక్షుడు అమిత్ షాతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధంగా ఉందని.. త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. తమకు సంబంధం లేదని పరోక్షంగా శివసేనను ఉద్దేశించి అన్నారు ఫడణవీస్.
మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్ పవార్... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఇవాళ సమావేశం కానున్నారు.
ఇదీ చూడండి : ఇండిగో సర్వర్ డౌన్... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు