దేశంలో ఉన్మాదుల చర్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. తాజాగా రాజస్థాన్‌లో బాలికలపై జరిగిన మూడు అత్యాచార ఘటనలు మహిళలు, చిన్నారుల భద్రతపై మరింత ఆందోళనలు పెంచుతున్నాయి.
వివాహానికి వెళ్తుండగా..
15 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఈ నెల 14న అల్వార్‌లోని హస్రౌరా గ్రామంలో జరిగింది. బంధువుల వివాహానికి వెళ్తుండగా బాలికపై అత్యాచారం జరిగింది. నిందితుల్లో ఇద్దరిపై బాధితురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారు. మరొకరు తప్పించుకున్నారు. కుటుంబ సభ్యుల దాడిలో ఓ నిందితుడు మృతి చెందాడు. పోలీసులు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.
బాధితురాలి బంధువులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. బాధితురాలి సోదరుడిపై మరణించిన మైనర్ కుటుంబ సభ్యులూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆరేళ్ల చిన్నారిపై..
మంచి నీటి కోసం బయటకు వెళ్లిన ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చురులోని భానిపుర ప్రాంతాన్ని కుదిపేసింది. 14 ఏళ్ల బాలుడు శుక్రవారం ఆ చిన్నారిపై ఘాతుకానికి పాల్పడినట్టు భానిపుర పోలీసులు తెలిపారు.
ధోల్పూర్లో...
8 ఏళ్ల బాలికపై శుక్రవారం ధోల్పూర్ ప్రాంతంలో అత్యాచారం జరిగింది. నిందితుడు 18ఏళ్ల పరేష్గా పోలీసులు గుర్తించారు. శనివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: గ్రౌండ్లో హిట్ వికెట్... నెట్లో ట్రోల్ టార్గెట్