అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఝార్ఖండ్ రాజధాని రాంచీని ఎంపిక చేసినట్లు ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన చేసింది. జూన్ 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపింది.
రాంచీలోని ప్రభాత్ తారా మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 30 వేల మంది పాల్గొంటారని ఆయుష్ మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. జూన్ 13న జరిగే సన్నాహక కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, యోగా సంస్థలు, గురువులు పాల్గొంటారని తెలిపింది.
దిల్లీలో వేడుకలు...
దిల్లీలో యోగా ప్రధాన కార్యక్రమం రాజ్‌పథ్‌లో న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్ఎమ్డీసీ) నిర్వహిస్తుందని ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. ఎర్రకోట, నెహ్రూపార్క్, తదితర ప్రాంతాల్లోనూ యోగా వేడుకలు జరుగుతాయని వివరించింది.
మీడియాకు అవార్డులు
యోగాపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించిన ప్రసార మాధ్యమాలను సత్కరిస్తామని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. పత్రికలు, టీవీ, రేడియో ఛానళ్లకు 11 చొప్పున మొత్తం 33 అవార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. జూన్ 10 నుంచి 25 వరకు యోగాపై చేసే ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటిస్తామని జావడేకర్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: భారతీయ రైళ్లలో ఇక 'మసాజ్' సౌకర్యం