ఇటీవలి కాలంలో ఏటీఎం చోరీలు ఎక్కువయ్యాయి. జల్సాలకు అలవాటుపడి దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు. ఇదే కోవకు చెందిన ఓ వ్యక్తి తమిళనాడు రామనాథపురం జిల్లా కేంద్రంలో ఏటీఎం చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డు అడ్డుకున్నాడు.
ఇదీ జరిగింది..
జిల్లా కేంద్రంలోని రామన్ చర్చి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకు ఏటీఎం చోరీ చేసేందుకు రాత్రి సమయంలో ఓ దుండగుడు శిరస్త్రాణం ధరించి, ఇనుప రాడ్డు పట్టుకుని లోపలకు ప్రవేశించాడు. అక్కడే పడుకున్న సెక్యూరిటీ గార్డు రుద్రపతి (50)పై రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఏటీఎం సెంటర్లోని విద్యుత్తు దీపాలు, సీసీ కెమెరాలు ఆపివేయాలని ఆదేశించాడు. తేరుకున్న గార్డు.. దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఇరువురి మధ్య కొంత సమయం పెనుగులాట జరిగింది. పలుమార్లు రాడ్డుతో దాడి చేయటం వల్ల గార్డుకు గాయాలయ్యాయి. అయినప్పటికీ అధైర్య పడకుండా దుండగుడి నుంచి ఇనుప రాడ్డును లాక్కుని, హెల్మెట్ తొలగించాడు. దాంతో భయపడి.. ఏటీఎం నుంచి పారిపోయాడు ఆ దొంగ.
సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: 'దోష నిర్ధరణపై స్టే ఇవ్వకపోతే పోటీకి అనర్హులే'