బిహార్ గయాలో మకర సంక్రాంతి నెలలో మాత్రమే దొరికే ప్రత్యేక మిఠాయి 'తిల్కుట్' ఈ సారి వివిధ ఫ్లేవర్లలో నోరూరిస్తోంది. ఏటా గయాలో మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. పండుగ రోజున ప్రతి ఇంట్లో చుడా, పెరుగు, తిల్కుట్ మిఠాయిలు పక్కాగా ఉండాల్సిందే. పర్వదినాన ఈ మూడు మిఠాయిలు తినడం వల్ల శుభాలు కలుగుతాయనేది ఇక్కడి వారి నమ్మకం. అయితే.. నువ్వులు, బెల్లం లేదా చక్కెరా కలిపి చేసే తిల్కుట్ మాత్రం బిహార్‌కే ప్రత్యేక పేరు తెచ్చిపెట్టింది.
ఒక్కసారి తిల్కుట్ రుచి చూస్తే వదిలిపెట్టలేరంటారు ఉత్తరాది వాసులు. అందుకే బిహార్‌లో తయారయ్యే ఈ మిఠాయిలు.. ఝార్ఖండ్, పశ్చిమ బంగాల్, దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాకూ ఎగుమతి అవుతాయి.
150 ఏళ్ల చరిత్ర...
గయాలోని రమణ రోడ్డు కరకరలాడే తిల్కుట్లకు ప్రసిద్ధి. సంక్రాంతికి నెల, రెండు నెలల ముందు నుంచే.. తిల్కుట్ సువాసనలతో నిండుపోతందీ ప్రాంతం. ఇక్కడి తిల్కుట్లకు 150 ఏళ్ల చరిత్ర ఉంది. ఏళ్ల క్రితం గోపీ షా అనే వ్యాపారి ఇక్కడ తిల్కుట్లు విక్రయించడం ప్రారంభించాడు. ఆయన వంశస్థులు వినూత్నతను జోడించి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే.. ఈ సారి రమణ రోడ్డులో తిల్కుట్లు మరింత ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తిల్కుట్ తయారీలో నైపుణ్యం సాధించినవారిని పిలిపించి మరీ కొత్త రకం తిల్కుట్లు తయారు చేయిస్తున్నారు దుకాణ దారులు. రకరకాల ఆకారాలు, వివిధ ఫ్లేవర్లలో ఘుమఘుమలాడుతూ.. వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
"ఇక్కడ ఎన్నో రకాల తిల్కుట్లు ఉన్నాయి. ఇందులో పాపడీ, చక్కర, బెల్లం, కోవాతో చేసినవి ఉన్నాయి. ఈ సారి ఇవన్నీ చాలా రుచిగా ఉన్నాయి. ధర కాస్త ఎక్కువుంది కానీ... నాణ్యమైన తిల్కుట్లు దొరుకుతాయి."
-రమేశ్ సాహ్, స్థానికుడు
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా తిల్కుట్లో వినియోగించే కువా, గ్వాలియర్ వంటి ఖరీదైన వస్తువుల వల్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.. అందుకే మార్కెట్లో తిల్కుట్ ధరలు పెరిగిపోయాయి.
సంక్రాంతి సీజన్లో..
ఉత్తరాదిలో సాంస్కృతిక నగరంగా పిలిచే గయా.. కాలానుగుణ మిఠాయిలకు ప్రసిద్ధి. వర్షాకాలంలో 'అనర్సా' ఎండాకాలంలో 'లై'.. శీతాకాలంలో 'తిల్కుట్'.
భారతీయులు సాధారణంగానే నువ్వులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. శరీరంలో వేడిని పుట్టించే ఈ చిరుధాన్యం చలికాలంలో సహజ ఔషధంగా పనిచేస్తుంది. అందుకే చలికాలంలో వచ్చే మకర సంక్రాంతి నాడు నువ్వులు తిన్నా, దానం చేసినా మంచిదంటారు పెద్దలు.
అందుకే బిహార్‌లో కట్టెలపోయ్యిపై నువ్వులు, చక్కెర, బెల్లం కలిపి చేసే ఈ తిల్కుట్.. సంప్రదాయ వంటకంగా మారింది.
ఇదీ చదవండి:ప్రపంచంలోనే తొలి 'చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్'