దిల్లీ ఘర్షణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టగా పార్లమెంట్ రెండో దఫా బడ్జెట్ సమావేశాలు తొలివారం సజావుగా సాగలేదు. ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. రాజ్యసభ గతవారం కేవలం 2 గంటల 42 నిమిషాలు మాత్రమే సమావేశమైంది.
26 గంటలు వ్యర్థం..
ముందస్తు ప్రణాళిక మేరకు చర్చలు జరపడంలో రాజ్యసభ విఫలమైందని అధికారులు పేర్కొన్నారు. పెద్దలసభలో గతవారం 28.30 గంటలపాటు చర్చ జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సభ ఎప్పటికప్పుడు వాయిదా పడిన కారణంగా 26 గంటల విలువైన సమయాన్ని నష్టపోయినట్లు తెలిపారు అధికారులు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఉత్పాదకత కేవలం 9.5 శాతంగా నమోదైందని స్పష్టం చేశారు.
స్థాయీ సంఘాల భేటీలకూ గైర్హాజరే..
50 శాతం మంది ఎంపీలు ఆయా శాఖల స్థాయీ సంఘాల భేటీలకు గైర్హాజరయ్యారని తెలిపారు అధికారులు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల్లో 57 శాతం, భాజపా ఎంపీలు 36 శాతం, 15 శాతం మంది కాంగ్రెస్ ఎంపీలు స్థాయీ సంఘాల భేటీలకు వెళ్లలేదని పేర్కొన్నారు.
వార్షిక పద్దును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మూడు వారాల అనంతరం రెండో దఫా బడ్జెట్ సమావేశాలు గత సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మూడు వారాల విరామ సమయంలో ఆయా శాఖల నుంచి అదనపు నిధుల మంజూరు కోసం వచ్చిన అభ్యర్థనలను పరిశీలించింది ఆర్థిక శాఖ.
ఇదీ చూడండి: 'ఆ మహిళలకు మోదీ పాస్వర్డ్ చెప్పింది అందుకే...'