ఎనిమిది మంది ఎంపీలపై ఛైర్మన్ ఆగ్రహం... వారం రోజుల పాటు సస్పెన్షన్... విపక్షాల నిరసనలు... సభ ఐదు సార్లు వాయిదా... సోమవారం రాజ్యసభలో పరిస్థితి ఇది.
ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు కార్యకలాపాలు జరగనివ్వలేదు. సభ సజావుగా లేకపోవడం వల్ల ఐదు సార్లు వాయిదా వేశారు ఛైర్మన్. అయినప్పటికీ పరిస్థితులు సద్దుమణగలేదు. సస్పెండ్ చేసిన ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లలేదు. సభను రోజు మొత్తం వాయిదా వేయాలని నినదించారు. ఇక చేసేదేమీ లేక సభను మంగళవారం ఉదయం 9 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.
సస్పెన్షన్ వేటు...
ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు అంతకుముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 మంది విపక్ష ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. బిల్లుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును వెంకయ్య తిరస్కరించారు. సభా నియమాల ప్రకారం డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం ఆమోదనీయం కాదన్నారు.
ఇదీ చూడండి: రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు
అప్రజాస్వామికం..
ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు సహా 8 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు అమెరికా నుంచి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
"భారత ప్రజాస్వామ్య గొంతును నొక్కేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మోదీ సర్కారు కారణంగా దేశం ఆర్థిక సమస్యల్లోకి జారుకుంది. ఇప్పుడు రైతులపట్ల కూడా అత్యంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు."
- రాహుల్ గాంధీ ట్వీట్