ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. తొలి రఫేల్ విమానాన్ని స్వీకరించేందుకు అక్టోబర్ 7న ఫ్రాన్స్ వెళ్లనున్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
అక్టోబర్ 8న రాజ్‌నాథ్‌కు తొలి విమానాన్ని అందించనుంది ఫ్రాన్స్. అదే రోజు విజయదశమితో పాటు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా ఉండటం వల్ల ఆ రోజును ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌లో విమానాలను స్వీకరించిన అనంతరం రాజ్‌నాథ్ ఓ శిక్షణ విమానంలో ప్రయాణించి పరిశీలించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో 3 రోజుల పాటు పర్యటించనున్నారు రాజ్‌నాథ్. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాలపై అక్టోబర్ 9న ఫ్రాన్స్ అధికారులతో భేటీ కానున్నారు.
అత్యాధునిక యుద్ధ విమానాలు
రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌కు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్ వినియోగిస్తోన్న వాటి కన్నా ఆధునికమైనందున.. భారత వాయుసేన పైలట్లకు దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 24 మందిని మూడు బ్యాచ్‌లుగా ఫ్రాన్స్‌కు పంపి వచ్చే ఏడాది మే నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.
భారత్‌కు అందే రఫేల్ విమానాల విషయంలో మరింత ఖర్చుతో మన దేశ పరిస్థితులకు తగ్గట్లుగా అదనపు ఫీచర్లను జోడిస్తున్నారు. రఫేల్ విమానాల స్క్వాడ్రన్‌లను హరియాణాలోని అంబాలా, బంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరాల్లో మొహరించే అవకాశం ఉందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: స్వచ్ఛభారత్ కోసం వింగ్ కమాండర్ వినూత్న ఫీట్