ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొంది అమరుడైన కల్నల్ అశుతోష్ శర్మకు కన్నీటి ధారల నడుమ తుది వీడ్కోలు పలికారు కుటుంబ సభ్యులు, వేర్వేరు రంగాల ప్రముఖులు. రాజస్థాన్ జైపుర్లోని కావేల్రీ మిలిటరీ మైదానంలో అధికారిక లాంఛనాల నడుమ ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. కల్నల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అశుతోష్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సౌత్ వెస్టర్న్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అలోక్ ఖేర్, సైనిక సంక్షేమ మంత్రి ప్రతాప్ సింగ్ తదితరులు.. అశుతోష్కు కన్నీటి వీడ్కోలు పలికారు.
అశుతోష్... 12 సార్లు పరీక్షల్లో విఫలమై, 13వ ప్రయత్నంలో సైన్యంలో చేరారు. 21 రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం కమాండింగ్ ఆఫీసర్ అయిన కల్నల్ గతంలో ఎన్నో ఉగ్రనిరోధక కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. రెండుసార్లు ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక సేన పురస్కారాన్ని అందుకున్నారు. హంద్వారాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న పౌరుల్ని రక్షించే క్రమంలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆ ఘటనలో మరో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు.
ఈ ఘటనలో అమరుడైన మరో సైనికాధికారి, మేజర్ అనుజ్ సూధ్.. అంత్యక్రియలు హరియాణాలోని పంచకులలో నిర్వహించారు. కుటుంబసభ్యులు, ఇతర సిబ్బంది హాజరయ్యారు.