దేశ వ్యాప్తంగా లాక్డౌన్తో షాపులు నడవక.. జనం బయటకు రాక నిరుపేదలు, వలసకార్మికులు, నిరాశ్రయులకు ఆహారం కరవైంది. ఈ నేపథ్యంలో అవసరంలో ఉన్న వారి ఆకలి తీర్చింది రైల్వే శాఖ. ఇప్పటి వరకు 30 లక్షల ఆహార ప్యాకెట్లను ఆయా ప్రాంతాల్లోని పేదలకు అందించింది. ఏప్రిల్ 20 వరకు 20 లక్షల ప్యాకెట్లను అందించగా.. కేవలం 10 రోజుల్లోనే 10 లక్షల ప్యాకెట్లను పంచింది. ఈ మేరకు రైల్వే శాఖ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.
"కరోనా వైరస్ వల్ల అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు, నిరుపేదలు, నిరాశ్రయులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఆర్పీఎఫ్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఐఆర్సీటీసీ వంటశాలల్లో వండిన ఆహారాన్ని.. ప్యాకెట్లలో సిద్ధం చేసి నిరుపేదలకు అందించాం. ఆహారం పంపిణీ చేసేటప్పుడు భౌతిక దూరం, పరిశుభ్రతను పాటించాం."
-రైల్వే ప్రకటన.
రైల్వేస్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఆహరం అందించినట్లు పేర్కొన్నారు అధికారులు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఆయా జోన్ల వాణిజ్య విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పాలనాధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
దేశంలోని అన్ని ఐఆర్సీటీసీ వంటశాలల్లో ఆహారం వండినట్లు వివరించారు. ఐఆర్సీటీసీ 17.17 లక్షల ఆహార ప్యాకెట్లను అందించగా, ఆర్పీఎఫ్ 5.18 లక్షలు, రైల్వే శాఖలోని వివిధ విభాగాలు 2.53 లక్షలు, స్వచ్ఛంద సంస్థలు 5.60 లక్షల భోజన ప్యాకెట్లను అందించినట్లు అధికారులు తెలిపారు.