కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేఠీ నామినేషన్ పత్రాలపై వచ్చిన అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి(ఆర్వో) తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది వాదనలు విన్న తర్వాత అమేఠీ ఆర్వో రామ్ మనోహర్ మిశ్రా ఈ నిర్ణయం తీసుకున్నారు. పౌరసత్వం, ఇతర విషయాలపై అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం నామినేషన్ పత్రం చెల్లుబాటవుతుందని స్పష్టంచేశారు.
రాహుల్ గాంధీ నామినేషన్‌పై ఆమేఠీ నుంచి పోటీ చేస్తోన్న స్వతంత్ర అభ్యర్థి, మరో ముగ్గురు శనివారం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాహుల్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న విద్యార్హతలు, పౌరసత్వంపై అనుమానాలున్నాయన్నారు.
బ్రిటన్ రిజిస్టర్డ్ సంస్థ సర్టిఫికెట్లో కాంగ్రెస్ నాయకుడు తాను బ్రిటిష్ పౌరునిగా పేర్కొన్నట్లు ఫిర్యాదుదారు ధ్రువ్ లాల్ తరఫు న్యాయవాది రవి ప్రకాశ్ ఆరోపించారు. సంబంధిత పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాహుల్ పౌరసత్వంపై అనుమానాలు నివృతి చేయాలని డిమాండ్ చేశారు. యూకే పౌరసత్వం నిజమైతే రాహుల్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని స్పష్టంచేశారు.
చివరకు రాహుల్ నామినేషన్ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల అధికారి ప్రకటించారు.