సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ్ బంగాలోని సిలిగుడిలో జరగాల్సిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ర్యాలీ రద్దయింది. ఆ ప్రాంతంలో రాహుల్ హెలికాప్టర్ లాండింగ్‌కు అనుమతి లభించకపోవడమే దీనికి కారణం. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత శంకర్ మలకర్ వెల్లడించారు.
"సిలిగుడి పోలీసు గ్రౌండ్స్‌లో ఈనెల 14న రాహుల్ గాంధీ హెలికాప్టర్ లాండింగ్ కోసం పోలీసులను సంప్రదించాము. కానీ వారు అంగీకరించలేదు. అందుకే ర్యాలీని రద్దు చేసుకున్నాము."
--- శంకర్ మలకర్, కాంగ్రెస్ నేత.
ఈ విషయంపై స్పందించిన సిలిగుడి పోలీసు కమిషనర్... కొన్ని నింబంధనల వల్లే అనుమతులు నిరాకరించినట్టు స్పష్టం చేశారు.
ర్యాలీపై గందరగోళం...
రాహుల్ ర్యాలీ రద్దుపై బంగాల్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. రాహుల్ ర్యాలీ రద్దు చేసినట్టు సీనియర్ నేత మలకర్ ప్రకటిస్తే... అసలు కాంగ్రెస్ అధ్యక్షుడి ర్యాలీ ఉన్నట్టే తనకు తెలియదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమెన్ మిత్రా తెలిపారు.
మిత్రాకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులను మలకర్ సంప్రదించారని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పకుండా ర్యాలీలు ఏర్పాటు చేయడమేంటని పలువురు సీనియర్ నేతలు మండిపడుతున్నారు.