రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసు తీర్పు సమీక్షా వ్యాజ్యాలపై విచారణ మరోమారు వాయిదా పడింది. డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలన్న అభ్యర్థనలపై ఈనెల 10న వాదనలు వింటామని సుప్రీంకోర్టు ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్టు ధిక్కరణ కేసుపైనా అదే రోజు విచారణ జరుపుతామని తెలిపింది.
సుప్రీంకోర్టు ముందుగా నిర్దేశించిన ప్రకారం రఫేల్ సమీక్షా వ్యాజ్యాలు, రాహుల్ కోర్టు ధిక్కరణ కేసుపై ఇవాళే విచారణ జరగాల్సి ఉంది. అయితే... రాహుల్ కేసును నేటి విచారణ జాబితాలో చేర్చకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. రెండు కేసులపై ఈనెల 10న వాదనలు వింటామని స్పష్టంచేశారు.
ఇదీ కేసు...
ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా వేరుగా పిటిషన్ దాఖలు చేశారు.
రివ్యూ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించగా... కేంద్రం ఈనెల 4న ప్రమాణపత్రం సమర్పించింది. తీర్పును పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వాదించింది.
రాహుల్ కేసు...
కాపలాదారే దొంగ అని రఫేల్ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
కోర్టు ధిక్కరణ నోటీసులపై రాహుల్ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రమాణపత్రం సమర్పించారు. తన వ్యాఖ్యలను అత్యున్నత న్యాయస్థానానికి ఆపాదించడం పొరపాటుగా జరిగిందని నివేదించారు. ప్రమాణపత్రంలో విచారం వ్యక్తంచేయడం... క్షమాపణ చెప్పడం లాంటిదేనని విన్నవించారు. రాహుల్ అఫిడవిట్‌తో సంతృప్తి చెందని న్యాయస్థానం... వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చింది.