నరేంద్ర మోదీ ప్రభుత్వం తప్పుడు ఆర్థిక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నోట్ల రద్దు, జీఎస్టీల కారణంగానే దేశంలో నిరుద్యోగ సమస్య ఏర్పడిందని ధ్వజమెత్తారు.
మహారాష్ట్ర యావత్మాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్. మోదీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
"నోట్ల రద్దు తర్వాత రూ.35వేల కోట్లతో నీరవ్ మోదీ లండన్ పారిపోవడం చూశారు. మెహుల్ చోక్సీ విదేశాలకు వెళ్లారు. నోట్ల రద్దుతో ఆగలేదు. జీఎస్టీ తీసుకొచ్చారు. దానిని అమలు చేయొద్దని విపక్ష హోదాలో ఉండి ప్రభుత్వానికి సూచించాం. దేశంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగం ఆరునెలల్లో రెట్టింపు అవుతుంది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా పేద ప్రజలు, చిరు వ్యాపారులే తీవ్రంగా ప్రభావితమయ్యారన్నారు రాహుల్. వారికి ఆర్థిక సాయం అందనంత వరకు దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఈసారి కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిని ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'దంగల్ చిత్రం.. చైనా అధ్యక్షుడ్నే మెప్పించింది'