వ్యవసాయ చట్టాల విషయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. గతంలో రైతు సమస్యలపై లోక్‌సభలో రాహుల్ మాట్లాడిన వీడియోను నడ్డా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రైతులు తమ పంటను నేరుగా అమ్ముకోవాలంటే మధ్యవర్తులను తొలగించాలని అప్పట్లో కాంగ్రెస్ నేత అనడాన్ని నడ్డా ప్రస్తావించారు.
రాహుల్ జీ! ఏంటీ మాయజాలం? మీరు గతంలో అనుకూలమని చెప్పిన సాగు చట్టాలను ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. మీకు దేశ, రైతుల ప్రయోజనాలతో సంబంధం లేదు. రాజకీయాలు మాత్రమే కావాలి. అయితే మీ ఆటలు సాగవు. అన్నదాతలు మీ ద్వంద్వ వైఖరిని తెలుసుకున్నారు.
-ట్విట్టర్లో జేపీ నడ్డా
వీడియోలో ఏముంది?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి వీడియో అది.
"నేను యూపీకి వెళ్లాను. అక్కడ ఒక రైతు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. 'ఆలూ చిప్స్ ప్యాకెట్ ధర రూ.10 ఉంది. అదే బంగాళదుంపలను రైతులు కిలో రూ.2కు అమ్ముతున్నారు. దీని వెనుక ఉన్న మాయ ఏంటి' అని ప్రశ్నించాడు. కారణం ఏమై ఉంటుందని నేను రైతునే అడిగాను. 'ఫ్యాక్టరీలు దూరంగా ఉన్నాయి. దీంతో కర్షకులు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. అలా కాకుండా రైతులే నేరుగా అమ్ముకునే వీలుంటే లాభం ఉంటుంది' అని ఆ రైతు చెప్పాడు" అని రాహుల్ అప్పట్లో లోక్‌సభలో చెప్పారు.
ఇదీ చదవండి: జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్సీపీ సింగ్!