కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీం కోర్టులో మరో ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రఫేల్ అంశంలో సుప్రీంకోర్టు తీర్పునకు, తన వ్యాఖ్యలకు ముడిపెట్టడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని విన్నవించారు.
కాపలాదారే దొంగ అని రఫేల్ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్కు ఈ నెల 23న నోటీసులు జారీ చేసింది. దీనిపై గతంలో ఓ అఫిడవిట్ దాఖలు చేసిన రాహుల్.. తాజా మరొకటి సమర్పించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.
"ఏ కోర్టూ అలాంటి వ్యాఖ్యలు చేయదు. అనుకోకుండా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసిందని చెప్పా. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. రాజకీయ ప్రచార వేడిలో అన్నా. అదో రాజకీయ నినాదం. రాజకీయాల్లోకి న్యాయస్థానాన్ని తీసుకురావాలనే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. కోర్టు చెప్పని మాటలను ఆపాదించాలన్న ఆలోచన అసలే లేదు. "
-- అఫిడవిట్లో రాహుల్ గాంధీ
రాజకీయ ప్రయోజనాల కోసమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోర్టుకు విన్నవించారు రాహుల్ గాంధీ.
" రాజకీయ ప్రయోజనాల కోసం, వివాదం చేసేందుకు, వ్యక్తిగత లాభం కోసం పిటిషనర్ (భాజపా నేత లేఖీ) నాపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. "
-- అఫిడవిట్లో రాహుల్ గాంధీ
రాహుల్పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై రేపు విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం.