దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఒక ఉద్యోగానికి 1000 మంది నిరుద్యోగులు ఉన్నారంటూ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
దేశంలో నిరుద్యోగం పెరుగిపోతుందన్న మీడియా కథనాన్ని ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. దేశాన్ని ఏం చేశారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. దేశం.. తన చరిత్రలో మొట్టమొదటి సారిగా నిరుద్యోగులకు.. ఉపాధి కల్పించలేని స్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్. మారటోరియం తర్వాత చాలా మంది అసంఘటిత రంగం నుంచి వైదొలుగుతారని... ఇది ఉపాధి సంక్షోభానికి దారి తీస్తుందని వెల్లడించారు.
"దేశంలో 90 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నది అసంఘటిత రంగమే. వారు ఎవరు? చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రైతులే. ఈ వ్యవస్థను ప్రధాని నరేంద్రమోదీ నాశనం చేశారు. మారటోరియం తర్వాత ఒకదాని తర్వాత మరొకటి చొప్పున కంపెనీలు వైదొలగటాన్ని మీరు చూస్తారు." అని అన్నారు రాహుల్.