కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పౌరసత్వంపై విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆయనకు నోటీసులు జారీ చేసింది. రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదుపై స్పందించిన హోంశాఖ ఈ మేరకు చర్యలు చేపట్టింది.
రాహుల్‌గాంధీ బ్రిటన్ దేశస్థుడంటూ ఇటీవల పలువురు నేతలు ఆరోపించారు. గతంలోనూ రాహుల్ పౌరసత్వంపై ప్రశ్నించిన సుబ్రమణియన్ హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
లండన్‌లో బ్యాకాప్స్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లలో రాహుల్ ఒకరని, కార్యదర్శిగానూ ఉన్నారని పేర్కొన్నారు. ఆ సమయంలో కంపెనీ వార్షిక రిటర్నుల దాఖలులో రాహుల్ బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు స్వామి.
సుబ్రమణియన్ స్వామి ఫిర్యాదుపై స్పందించిన హోం శాఖ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచించింది.
ఇటీవల అమేఠీలో రాహుల్ నామినేషన్ దాఖలు సమయంలోనూ.. ఆయన బ్రిటీష్ పౌరుడని, ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు భాజపా నేతలు.
ఇదీ చూడండి: రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం..