సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నియోజకవర్గంలో పర్యటించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. తన ఓటమికి స్థానిక నాయకులు ప్రజలకు దూరంగా ఉండటమే కారణమని వెల్లడించారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని ఎప్పటికీ వదిలి వెళ్లనని పేర్కొన్నారు రాహుల్.
అమేఠీ చేరుకున్న వెంటనే గౌరీగంజ్‌లోని తిలోలి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ మాత ప్రసాద్ వైశ్ను పరామర్శించారు. అనంతరం స్థానిక నిర్మలాదేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు రాహుల్. సలోన్, అమేఠీ, గౌరీగంజ్, జగ్దీశ్పూర్, తలోయ్ అసెంబ్లీ విభాగాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.
"నేను అమేఠీని వదిలి వెళ్లను. ఇది నా ఇల్లు. నా కుటుంబం. అమేఠీ అభివృద్ధి ఆగిపోకూడదు. నేను వయనాడ్‌కు ఎంపీ కావచ్చు. కానీ అమేఠీతో నా బంధం మూడు దశాబ్దాలుగా ఉంది. అమేఠీ కోసం దిల్లీలో పోరాటం చేస్తా. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు పార్టీ కోసం ఎంతో శ్రమించారు. కానీ పార్టీ నాయకులు ప్రజలకు దూరంగా ఉన్నారు. అదే ఓటమికి కారణం."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు పార్టీ కార్యకర్తలు. వెంటనే రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు.
వెలిసిన పోస్టర్...
రాహుల్ పర్యటన సందర్భంగా జిల్లాలోని పార్టీ కార్యాలయం ఎదుట ఓ పోస్టర్ వెలిసింది. సంజయ్ గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆసుపత్రి.. వైద్యం అందించడానికి నిరాకరించడం వల్ల ఓ వ్యక్తి మరణించాడని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: ఓటమి తర్వాత తొలిసారి అమేఠీకి రాహుల్