ఉత్తరప్రదేశ్ అమేఠీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్‌తో పాటు ఏఐసీసీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరు కానున్నారు. గౌరిగంజ్ పట్టణంలో రోడ్ షోలో పాల్గొన్న అనంతరం అమేఠీ జిల్లా పరిపాలనా కార్యాలయానికి చేరుకుంటారు.
అమేఠీ స్థానం నుంచి 15 సంవత్సరాలుగా పోటీ చేస్తున్నారు రాహుల్. 2014లో భాజపా నేత స్మృతి ఇరానీపై లక్ష మెజారిటీతో గెలిచారు. అమేఠీలో మే 6న ఎన్నికలు జరుగుతాయి.
పరీక్ష ఫీజు రద్దు: రాహుల్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోటీ పరీక్షలకు దరఖాస్తు రుసుమును రద్దు చేస్తామని ట్విట్టర్లో ప్రకటించారు రాహుల్. పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత వైద్యం ప్రతి పౌరుడి హక్కు అని ఉద్ఘాటించారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడులు జీడీపీలో మూడు శాతానికి పెంచుతామని స్పష్టం చేశారు.