భారత రక్షణ రంగం బలాన్ని పెంచే రఫేల్ యుద్ధ విమానాల తొలి బ్యాచ్.. వైమానిక దళం(ఐఏఎఫ్)లో అధికారికంగా చేరేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే భారత్ చేరుకున్న ఐదు రఫేల్ జెట్లను గురువారం లాంఛనంగా వైమానిక దళానికి అప్పగించనుంది రక్షణ శాఖ. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ రఫేల్ యుద్ధ విమానాలు వైమానిక దళంలో చేరుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాయుసేనకు రఫేల్ యుద్ధ విమానాలు అప్పగించేందుకు అంబాలా ఎయిర్‌బేస్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది రక్షణ శాఖ. దీనికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, వాయుసేన సారథి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
రఫేల్‌కు పూజలు...
సంప్రదాయ పద్ధతిలో రఫేల్ విమానాలకు 'సర్వ ధర్మ పూజ' చేయనున్నారు. ఆ తర్వాత రఫేల్‌తో పాటు తేజస్ జెట్లు వాయు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి.
రఫేల్ జెట్లను వైమానిక దళంలోకి పంపే ముందు.. వాటర్ కెనాన్ సెల్యూట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐఏఎఫ్ వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు.
మరో 36 జెట్ల కొనుగోలుకు చర్చలు?
వాయుసేనకు రఫేల్ జెట్ల అప్పగింత పూర్తైన తర్వాత రాజ్‌నాథ్, పార్లీ మధ్య భారత్-ఫ్రాన్స్ పరస్పర ద్వైపాక్షిక రక్షణ సహకార బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మరో 36 రఫేల్ జెట్ల కొనుగోలు అంశం కూడా వీరి భేటీలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.