'అసాధారణ వీరత్వం' దేశాన్ని ముందుకు నడిపించలేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రజల్లో పెరుగుతున్న అంచనాలను అందుకోగల సమర్థ నాయకులు ఇప్పుడు దేశానికి అవసరముందని తెలిపారు. ఏఐఎమ్ఏ మేనేజింగ్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారాయన.
దేశంలోని 60 శాతానికి పైగా సంపద కేవలం 1 శాతం మంది చేతుల్లోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం నుంచి ప్రజలను బయటపడేసేందుకు కార్పొరేట్లు కృషి చేయాలని కోరారు. లేదంటే అంతరం పెరిగి అనిశ్చితికి దారితీస్తుందన్నారు.
" 'అసాధారణ హీరోయిజం' దేశాన్ని నడిపించదు. దేశ ప్రజల్లో పెరుగుతున్న అంచనాలను అందుకోగల సమర్థ నాయకుల అవసరం ఇప్పుడుంది. పేదరిక నిర్మూలనలో దేశం ఇంకా చాలా దూరంలో ఉంది."
- ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి.
2005-06 నుంచి దశాబ్ద కాలంలో దేశంలో సుమారు 270 మిలియన్ల ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రణబ్ అన్నారు. పేదరికం రేటు దేశంలో సగానికి తగ్గటాన్ని సానుకూల అంశంగా పేర్కొన్నారు. కానీ ఇంకా 269 మిలియన్ల ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువనే జీవిస్తున్నారని గుర్తుచేశారు.
వ్యాపారస్థులు స్వలాభం కోసం కాకుండా ఉద్యోగ కల్పన, సామాజిక సంపద సృష్టి, ఎక్కువ మంది ఆర్థిక వృద్ధి సాధించేలా అవకాశాల కల్పన లక్ష్యాలుగా పెట్టుకోవాలన్నారు. ప్రజల ఆదాయం పెంచేందుకు బడా వ్యాపారస్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.