ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్(కేఎల్ఎఫ్)కు చెందిన ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న వీరు.. సామాజిక నేతలు- మతపెద్దలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కుట్రపన్నినట్టు పోలీసులు తెలిపారు.
పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా ప్రకారం.. ఈ ముగ్గురిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. వీరిని సుఖ్‌చైన్ సింగ్, అమ్రిత్‌పాల్ సింగ్, జస్ప్రీత్ సింగ్‌గా గుర్తించారు. వీరి నుంచి ఒక తుపాకీ, 7 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో సంబంధం ఉన్న లవ్‌ప్రీత్ సింగ్‌ను ఇటీవలే దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్ పోలీసులు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9 ఉగ్రవాద కుట్రలను భగ్నం చేసినట్టు డీజీపీ గుప్తా పేర్కొన్నారు.