కొద్ది రోజుల్లో శీతాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో కశ్మీర్ లోయలో పారామిలిటరీ బలగాల కోసం 40 ప్రత్యేక గుడారాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం. మంచులో విధులు నిర్వహించాల్సిన దృష్ట్యా ఇప్పటికే బలగాలు ఉపయోగిస్తున్న ప్రైవేటు ఇళ్లు, హోటళ్లలోనూ శీతాకాలానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేసేందుకు ఆమోద ముద్ర వేసింది.
పాలి యురేథిన్ ఫోమ్‌తో మందపాటి గుడారాలను బలగాల కోసం ఏర్పాటు చేయనున్నారు. మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేవారికి గుడారాల ఏర్పాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు అధికారులు.
శీతాకాలం పూర్తిస్థాయిలో రావడానికి ఇంకా నెలరోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో చలికాలానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం... కేంద్ర బలగాలు ఎక్కువకాలం కశ్మీర్‌లోయలో ఉండే అవకాశాలను సూచిస్తోంది.
మొట్టమొదటిసారిగా పరుపులు
మొట్టమొదటిసారిగా బలగాల కోసం రెండు లక్షలకుపైగా కొబ్బరిపీచు పరుపులు కొనుగోలు చేయనుంది సీఆర్పీఎఫ్. వీటిని కశ్మీర్‌లోయలో మోహరించిన జవాన్లకు అందించనుంది. ఇప్పటివరకు పలుచనైన డార్రీ దుప్పట్లే కేంద్ర బలగాలకు అందించేవారు.
ప్రైవేటు భవనాల్లోనూ మెరుగైన సౌకర్యాలు
2003లో కశ్మీర్లో సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు ప్రారంభమైన అనంతరం 100 చిన్న హోటళ్లు, స్థానిక పండిత్‌లు వదిలేసిన ఇళ్లను సైనిక అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు కాని కారణంగా అప్పటి నుంచి వాటిలో ఎలాంటి మెరుగైన సౌకర్యాలు కల్పించలేదు. తాజాగా ప్రైవేటు ఆస్తుల్లోనూ వసతులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది కేంద్రం.
ఇదీ చూడండి: క్యాబ్‌లో కండోమ్‌లు తప్పనిసరి... లేదంటే జరిమానా!