బంగాల్లో జూనియర్ డాక్టర్ల సమ్మె ఐదో రోజుకు చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చల కోసం సచివాలయానికి ఆహ్వానించినప్పటికీ జూడాలు తిరస్కరించారు. సీఎం ప్రవర్తించిన తీరుకు.. ఆమె బేషరతు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు వైద్యులు.
మరో ఆరు డిమాండ్లను పరిష్కరించాలని మమత ముందుంచారు. వాటి పరిష్కారానికి హామీ ఇస్తేనే.. తిరిగి విధుల్లోకి చేరతామని తేల్చిచెప్పారు.
"ముఖ్యమంత్రి చర్చలకు పిలిచినప్పటికీ మేము సచివాలయానికి వెళ్లదలచుకోలేదు. గురువారం ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి వెళ్లి ఆమె చేసిన ఆరోపణలకు ఎన్ఆర్ఎస్ కళాశాలకు, ఆసుపత్రికి వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి." - అరిందామ్ దత్తా, జూడాల సంఘం ప్రతినిధి
కేంద్ర ఆరోగ్యమంత్రితో...
భారత వైద్య సంఘం (ఐఎమ్ఏ) సభ్యుల బృందం బంగాల్లో వైద్యుల ఆందోళనపై కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి వివరించారు.
స్థానిక వైద్యుల సంఘం (ఆర్డీఏ)...
మొత్తం సీనియర్, జూనియర్ వైద్యులందరూ తమ విధులకు హజరవుతున్నట్లు ఎయిమ్స్‌లోని ఆర్డీఎ (స్థానిక వైద్యుల సంఘం) అధ్యక్షుడు తెలిపారు. అయితే నల్ల రిబ్బన్లు, శిరస్త్రాణాలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. జూన్ 17 లోపు బంగాల్ ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
ఇదీ వివాదం...
కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.
జూనియర్ డాక్టర్లను గురువారం హెచ్చరించారు బంగాల్ ముఖ్యమంత్రి. 4 గంటల్లోగా విధుల్లోకి చేరాలని హుకుం జారీ చేశారు. ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో బయటివారు వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైద్యుల సమ్మె భాజపా, సీపీఎంల కుట్ర అని ఆరోపించారు మమత.
- ఇదీ చూడండి: ఒకరిని కాపాడే యత్నంలో మరో ఆరుగురు మృతి