ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో కామాంధుల రాక్షసత్వానికి 90 శాతం దహనమై.. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చనిపోయిన బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది యూపీ ప్రభుత్వం.
బాధితురాలికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
హోరెత్తిన నిరసనలు..
ఆడపిల్లలను కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనకారులు భగ్గుమన్నారు. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన భాజపా మంత్రులు, లోక్‌సభ సభ్యులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, కమల్ రాణి వరుణ్, భాజపా ఎంపీ సాక్షి మహారాజ్... ఉన్నావ్‌లోని బాధితురాలి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఇంటి బయట నిరసనలతో కిక్కిరిసిన విద్యార్థులు, ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వారిని అడ్డుకున్నారు.
'వెనక్కి వెళ్లిపోండి' అంటూ సుమారు 15 నిమిషాల పాటు నినదించారు. వారిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో భాజపా నాయకులు సహా స్థానిక కాంగ్రెస్ నాయకులకూ గాయాలయ్యాయి. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి మంత్రులను, ఎంపీని బాధితురాలి ఇంటికి చేర్చారు.