ప్రజలను తప్పుడు హామీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
సొంత నియోజకవర్గ ప్రజల క్షేమసమాచారాలు తెలుకోవడానికి మోదీ సమయం కేటాయించలేదన్నారు ప్రియాంక. రైతులను విస్మరించారని, నిరుద్యోగులను పట్టించుకోలేదని ఆరోపించారు.
నిజంగానే ప్రధానికి శక్తి ఉంటే... ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించలేదో తెలపాలన్నారు. ప్రతి ప్రసంగంలో పాకిస్థాన్ గురించి ప్రస్తావించే మోదీ... తన ఐదేళ్ల పాలననూ ప్రస్తావించాలని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో నిజమైన శక్తి ప్రజలేనని, పెద్ద పెద్ద ప్రచారాలు నిర్వహిస్తే శక్తి ఉన్నట్టు కాదని అన్నారు ప్రియాంక.
"తాము ఎంతో శక్తిమంతులమని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలను పోగు చేసి సభలకు తీసుకొస్తారు. దేశాన్ని అభివృద్ధి చేస్తామని ప్రచారాలు చేస్తారు. కానీ ఇంత పిరికి, బలహీన ప్రధానిని నేను నా జీవితంలో చూడలేదు. పెద్ద పెద్ద ప్రచారాలు, టీవీ షోల్లో కనపడితే రాజకీయ శక్తి రాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పెద్దలు. ప్రజల మాటలు వినే శక్తి ఉండాలి. వారి సమస్యలను తెలుసుకోగలిగే శక్తి ఉండాలి. మీ(ప్రజలు) మాటలు వినడమనే విషయాన్ని పక్కన పెట్టండి. మీకు సమాధానం చెప్పడమూ తెలియదు ఈ ప్రధానికి."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.