ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోరాటం ముగిసింది. మీర్జాపుర్ జిల్లాలోని చునార్ అతిథి గృహంలో సోన్‌భద్ర బాధితుల కుటుంబ సభ్యులను కలిసిన ప్రియాంక... వారణాసికి పయనమయ్యారు.
"ఇది రాజకీయాలకు సంబంధించింది. అమాయకులను హత్య చేస్తున్నారు. వారికి అన్యాయం జరుగుతోంది. చిన్న పిల్లల తల్లిదండ్రులను హత్య చేస్తున్నారు. గిరిజనుల భూములను లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోంది. నన్ను తమ వాహనాల్లో ఇక్కడకు తీసుకొచ్చిన వారు, నా ఎదురు నిలబడి నన్ను బయటకు వెళ్లకుండా అడ్డుపడ్డ వారు.. ఈరోజున నేను అరెస్టు కాలేదంటున్నారు. నేను వెళ్లొచ్చని అంటున్నారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. నా ఆకాంక్ష నెరవేరింది. బాధితుల కుటుంబసభ్యులను కలిశా. నేను ఇప్పుడు వెళ్తున్నా... కానీ కచ్చితంగా తిరిగొస్తా"
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి.
అంతకుముందు బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ప్రియాంక హామీ ఇచ్చారు. మృతుల కుటుంబ సభ్యులకు 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.
ఇదీ జరిగింది...
సోన్‌భద్ర బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించడానికి శుక్రవారం బయలుదేరిన ప్రియాంకను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డగించి చునార్ అతిథి గృహానికి తరలించారు. రాత్రంతా ప్రియాంక అతిథి గృహంలోనే గడిపారు. వెనుదిరగమని స్థానిక అధికారులు అభ్యర్థించినప్పటికీ ఆమె అక్కడి నుంచి కదలలేదు. బాధితులను కలిసేంతవరకు రాష్ట్రాన్ని విడిచి వెళ్లనని తేల్చిచెప్పారు. శనివారం అక్కడే ధర్నాకు దిగారు. అవసరమైతే జైలుకెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు.
రాజకీయ దుమారం...
ఉత్తరప్రదేశ్‌లో రోజంతా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. చునార్ అతిథి గృహం వద్ద పోలీసులను భారీగా మోహరించారు అధికారులు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తృణమూల్ కాంగ్రెస్ బృందాన్ని వారణాసి విమానాశ్రయంలో పోలీసుల అడ్డుకున్నారు.
కొద్ది సేపటికి అదే వారణాసి విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలనూ పోలీసులు అడ్డగించారు. వారూ సోన్‌భద్ర బాధితులను పరామర్శించడానికే బయలుదేరారు. వీరిలో దీపేందర్ సింగ్ హుడా, ముకుల్ వాస్నిక్, రాజ్ బబ్బర్, రాజీవ్ శుక్లా తదితరులున్నారు.
పోలీసుల చర్యలపై స్పందించిన బీఎస్పీ అదినేత్రి మాయావతి భాజపాపై మండిపడ్డారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు భాజపా 144 సెక్షన్‌ను వినియోగిస్తోందని ఆరోపించారు.
గవర్నర్ వద్దకు కాంగ్రెస్ బృందం...
రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శనివారం ఉదయం ప్రమోద్ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్‌ను కలిసింది. అనంతరం రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొందని ప్రమోద్ ఆరోపించారు.
ప్రియాంకకు రాహుల్ మద్దతు...
రాత్రంతా అతిథి గృహంలో గడిపిన ప్రియాంకకు సోదరుడు రాహుల్ గాంధీ మద్దతుగా నిలిచారు. భాజపాపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రజాస్వామ్యాన్ని అణచివేయడానికి యత్నిస్తోందని ఆరోపించారు రాహుల్. ఇలాంటి ఘటనలతో కాంగ్రెస్ బెదరదని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం హస్తం పార్టీ నిత్యం పోరాడుతూనే ఉంటుందన్నారు.
'నిన్ను చూస్తే...'
యూపీ ఘటనపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. గ్రామస్థులపై జరిగిన దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు ప్రియాంకపై తనకున్న గౌరవం మరింత పెరిగిందని ట్వీట్ చేశారు.
సోన్‌భద్ర వివాదం...
ఈ నెల 17న సోన్‌భద్రలోని ఘోరావల్ వద్ద రెండు వర్గాల మధ్య భూమి విషయమై ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒక వర్గానికి చెందిన వారు మరొక వర్గంపై కాల్పులు జరిపారు. ఫలితంగా 10 మంది చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు.