కరోనా భయంతో అనేక కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోం' అవకాశం కల్పించాయి.. కొన్ని సంస్థలు సెలవులను ప్రకటించాయి. ఈ ప్రభావం సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలపైనా పడింది. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోకుండా మోదీ జోక్యం చేసుకోవాలని సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ (సీఏపీఎస్ఐ) చైర్మన్ కె.విక్రమ్ సింగ్ లేఖ రాశారు.
సుమారు 85 లక్షలకు పైగా శ్రామిక శక్తి, 22 శాతం వార్షిక వృద్ధి రేటుతో దేశంలోనే భారీ స్థాయిలో ఉద్యోగ కల్పన ఉన్న రంగాల్లో ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ ఒకటి. వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులు ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు విక్రమ్.
జీవనోపాధి సంగతేంటి?
వైరస్ వాప్తి కారణంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మాల్స్, హోటళ్లు, థియేటర్లు తాత్కాలికంగా మూసేశారు. ఇందులో చాలామంది సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం ఒక సెక్యూరిటీ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి చాలా సంస్థలు. అయితే మిగతా సిబ్బంది జీవనోపాధి సంగతేంటని విక్రమ్ ప్రశ్నించారు. ఈ పరిస్థితులు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని వివరించారు.
లక్షలాది మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, 23వేల మంది యజమానులను ఈ అనిశ్చితి నుంచి కాపాడాలని మోదీని కోరారు.