దశాబ్దాల తరబడి పేరుకుపోయిన ఎన్నో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిందని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తమ ఎన్డీఏ హయాంలో ఎన్నో భవన నిర్మాణాలను నిర్ణీత సమయంలో పూర్తి చేశామని పేర్కొన్నారు. దిల్లీలోని బీడీ మార్గ్‌లో సోమవారం పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన బహుళ అంతస్తుల ఫ్లాట్లను ప్రధాని ప్రారంభించారు. వర్చువల్‌గా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"పార్లమెంటు సభ్యుల వసతి అవసరాన్ని 2014లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుర్తించింది. దశాబ్దాలుగా ఉండిపోయిన ఆ సమస్య నుంచి తప్పించుకోకుండా ఓ పరిష్కారం చూపాం. ఎన్నో భవనాలను మా ప్రభుత్వం నిర్ణీత సమయంలో పూర్తి చేసింది. అటల్జీ వాజ్‌పేయి హయాంలో నిర్ణయించిన అంబేద్కర్ నేషనల్ మెమొరియల్‌ను మా ప్రభుత్వం పూర్తి చేసింది. 23 ఏళ్ల తర్వాత అంబేద్కర్ సమాచార కేంద్రాన్ని మేము నిర్మించాము.
--- ఫ్రధాన మంత్రి, నరేంద్ర మోదీ.
కేంద్ర సమాచార కమిషన్ భవనాన్ని తాము కట్టామని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఇండియా గేట్ సమీపంలో వార్ మెమొరియల్‌ను తాము నిర్మించామని అన్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల వల్ల 17వ లోక్‌సభ ఖ్యాతి చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు. రానున్న 18వ లోక్‌సభ కూడా అంతే స్థాయిలో ప్రశస్తి సంపాదిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సాంకేతికత మేళవింపుతో..
బీడీ మార్గ్‌లో 80ఏళ్ల నాటి 8 భవనాల స్థానంలో ఎంపీల కోసం కొత్తగా.. 76 ఫ్లాట్లను నిర్మించారు. వీటి నిర్మాణం కోసం కేటాయించిన నిధులకన్నా 14 శాతం తక్కువఖర్చుతో నిర్మాణాలు పూర్తిచేశారు. కరోనావంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ జాప్యం లేకుండా.. వీటి నిర్మాణం పూర్తయ్యింది.
ఈ భవనాల నిర్మాణంలో పర్యావరణహితమైన పద్ధతులు పాటించారు. ఫ్లై యాష్‌తో చేసిన ఇటుకలను నిర్మాణంలో వాడారు. సమర్థంగా విద్యుత్ వినియోగం కోసం డబుల్ గ్లేజ్డ్ కిటికీలు ఎల్ఈడీ లైట్లను ఉపయోగించారు. మనుషులు ఉన్నప్పుడు మాత్రమే లైట్లు వెలిగేలా సెన్సర్లు, తక్కువ విద్యుత్‌ను వాడుకునేలా వీఆర్వీ వ్యవస్థతో కూడిన ఏసీలు బిగించారు. వర్షపు నీటి సేకరణకు ప్రత్యేక వ్యవస్థ సహా.. పైకప్పుపై సోలార్ వంటివి ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:'కరోనా కట్టడికి మీరు చేసిందేంటి?'