దేశంలో కరోనా వైరస్ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం మానవాళి మొత్తం సంక్షోభం ఎదుర్కొంటోందని అన్నారు.
ఈ సందర్భంగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు మోదీ. అవసరమైతే తప్ప కొద్ది రోజులపాటు బయటకు రావద్దని కోరారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని అభ్యర్థించారు. ఆదివారం దేశవ్యాప్తంగా 'జనతా కర్ఫ్యూ' పాటించాలన్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రాకుండా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు.
"జనతా కర్ఫ్యూ అంటే జనం కోసం జనం ద్వారా జనమే తమపై విధించుకునే కర్ఫ్యూ. జనతా కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటకి రావద్దు. మీ ఇళ్లలోనే ఉండండి. జనతా కర్ఫ్యూ ద్వారా వచ్చే అనుభవం రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధనంగా ఉపయోగపడుతుంది. జనతా కర్ఫ్యూను ఆచరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రావాలని కోరుతున్నా. కరోనా వంటి విశ్వవ్యాప్త వైరస్ను ఎదుర్కొవడంలో భారత్ ఏ విధంగా సిద్ధమవుతోందన్న విషయం పరీక్షించుకోవడానికి జనతా కర్ఫ్యూ ఉపయోగపడుతుంది."-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రవాణా రంగం, ఆటో, ట్యాక్సీలు నడిపేవారి సేవలు అత్యంత అసామాన్యమైనవని కొనియాడారు మోదీ. వ్యాధి సోకే అవకాశాలు ఉన్నా... వీరందరూ జాతి కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారని కీర్తించారు.