ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ సందర్భంగా చికాగో, హ్యూస్టన్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు.
ప్రధాని మోదీ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా... ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ప్రవాస భారతీయ సంఘాలు తెలిపాయి.
భారతీయ అమెరికన్ ప్రజల్లో అత్యధిక శాతం హ్యూస్టన్లోనే ఉంటున్నారు. అందువల్ల ఆ ప్రాంతాన్ని సందర్శించాలని మోదీ భావిస్తున్నారు. పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 22న హ్యూస్టన్‌లో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశమవుతారు. సెప్టెంబర్ 23న ఐరాసలో వాతావరణ మార్పులపై జరిగే ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
ప్రవాస భారతీయులతో..
2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు భారత-అమెరికన్ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ఇది మూడో సారి. ఇంతకుముందు 2014లో న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో, 2016లో సిలికాన్ వ్యాలీలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. అపుడు మోదీ ప్రసంగాలు వినడానికి సుమారు 20 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు.
ప్రతిపాదిత హ్యూస్టన్ కార్యక్రమం నిర్వహించడానికి 70 వేల మంది కూర్చొనే సామర్థ్యం కలిగిన బహుళార్థ సాధక 'ఎన్ఆర్జీ' స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చూడండి: కర్తార్‌పుర్ నడవాపై భారత్-పాక్ మరోసారి..