వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయం చేయడమే లక్ష్యంగా లక్ష కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సహా దేశంలోని లక్షలాది మంది రైతులు పాల్గొన్నారు.
గిట్టుబాటు ధరలు..
ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించనున్నారు. వీటి ద్వారా పంట ఉత్పత్తులు పాడవకుండా కాపాడుకోవడం సహా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం, ప్రాసెసింగ్ వంటి సదుపాయాలతో గిట్టుబాటు ధరలు వస్తాయని పేర్కొంది.
రూ. లక్ష కోట్లు మంజూరు..
పలు రుణసంస్థల భాగస్వామ్యంతో ఈ సదుపాయాల కల్పనకు కేంద్రం లక్ష కోట్ల రూపాయలను మంజూరు చేయనుంది. ఇందుకోసం 11 ప్రభుత్వరంగ బ్యాంకులతో వ్యవసాయశాఖ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేసే వారికి 3 శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకూ రుణానికి హామీ ఇవ్వనుంది.
దీంతోపాటు పీఎం కిసాన్ పథకం కింద ఆరో విడత నిధులను ప్రధాని విడుదల చేశారు. 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రెండు వేలు చొప్పున పడేలా మొత్తం రూ.17 వేల కోట్లు విడుదలయ్యాయి.
ఇదీ చదవండి: 101 రక్షణ పరికరాల దిగుమతులపై నిషేధం