కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఏడాది పాటు తన జీతంలో 30శాతాన్ని వదులుకోనున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. దీంతో పాటు రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాలు నిరాడబరంగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
ఎట్ హోమ్ సహా ఇతర కార్యక్రమాలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను తగ్గించుకోనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. పూలు, అలంకరణ సామాగ్రితో పాటు మెనూలోనూ.. ఆహార పదార్థాలను కుదించింది. ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించే విలాసవంతమైన కారు-'లిమోసిన్' కొనుగోలును వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశీయంగా రాష్ట్రపతి పర్యటనలను సైతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది. వ్యయాలు తగ్గించడం సహా భౌతిక దూరం పాటించే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొంది.
"ఇవి చిన్న విషయాలైనప్పటికీ.. భారత్ స్వావలంబన సాధించడానికి ఇవి పెద్ద ఎత్తున సహకారం అందిస్తాయని, కొవిడ్‌తో పోరాటంలో భాగంగా భారత్‌కు మరింత శక్తిని అందిస్తాయని' రాష్ట్రపతి అభిప్రాయపడుతున్నట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది.
పేపర్ వాడకాన్ని తగ్గించి, రాష్ట్రపతి భవన్‌ను పర్యావరణ హితంగా మార్చేందుకు ఈ-సాంకేతికత విధానాన్ని ఉపయోగించనున్నట్లు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. విద్యుత్, ఇంధనం ఆదా చేయడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.