నిర్భయ కేసులో నాలుగో దోషి పవన్ కుమార్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. మిగతా ముగ్గురు దోషులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ల పిటిషన్లను ఇదివరకే తిరస్కరించారు కోవింద్.
మిగతా ముగ్గురికి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. పవన్ గుప్తాకు మాత్రం.. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణను సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశముంది.
2 రోజుల క్రితం రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉందని.. ఉరిపై స్టే విధించాలని పవన్ కుమార్ గుప్తా దాఖలు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన దిల్లీ కోర్టు.. శిక్ష అమలును మరోసారి వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలు చేయవద్దని స్పష్టం చేసింది.
ఒకరితర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ ఉరి అమలును వాయిదా వేసేలా చేస్తూ వచ్చారు నిర్భయ దోషులు. ఇప్పటికి వీరి ఉరి శిక్షపై 3 సార్లు స్టే విధించింది దిల్లీ కోర్టు. ఇప్పుడు రాష్ట్రపతి నిర్ణయంతో.. తిహార్ జైలు అధికారులు మరోసారి డెత్ వారెంట్ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దోషులకు ఈ నెలలోనే ఉరి శిక్ష విధిస్తారని ఆశిస్తున్నట్లు నిర్భయ తండ్రి తెలిపారు.