మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖులు నివాళులర్పించారు. దిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
అంతకుమందు రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రణబ్‌కు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ సహా మరికొంత మంది ప్రముఖులు ప్రణబ్‌కు నివాళులర్పించారు. మరికొందరు ప్రముఖులూ ప్రణబ్‌కు చివరిసారి వీడ్కోలు పలికేందుకు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ప్రణబ్ ముఖర్జీ పార్థివదేహాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు. తదనంతరం గార్డ్ ఆఫ్ హానర్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రణబ్ భౌతికకాయాన్ని శ్మశాన వాటికకు తరలించనున్నారు. గన్ క్యారేజీపై కాకుండా సాధారణ అంబులెన్సులో శ్మశాన వాటికకు తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లోధి శ్మశాన వాటికలో సైనిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా సురక్షిత దూరం, ఇతర నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి:'భారతరత్నం' నీకు సైకత నివాళి!