శనివారం విడుదలైన అసోం ఎన్ఆర్సీపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాదాపు 19 లక్షల మందికి ఈ జాబితాలో చోటు దక్కకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ కుటుంబీకుల పేర్లూ ఎన్ఆర్సీలో లేకపోవడం చర్చనీయాంశమైంది.
భారత 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడు ఎహ్త్రాముద్దీన్ కుటుంబ సభ్యుల పేర్లు ఎన్ఆర్సీలో లేవు. జియాఉద్దీన్(ఎహ్త్రాముద్దీన్ కుమారుడు) కుటుంబం ఎన్నో ఏళ్లుగా అసోంలోని కామ్రూప్ జిల్లాలో నివసిస్తోంది. మాజీ రాష్ట్రపతి సహా తమ పూర్వీకుల పేర్లు 1951 ఎన్ఆర్సీలో కనపడకపోవడంపై జియాఉద్దీన్ కుటుంబం ఆశ్చర్యపోయింది. 1971 ముందు వరకు ఉన్న ఓటరు జాబితాల్లోనూ వీరి పేర్లు లేవు. అందుకే వీరు ఈసారి ఎన్ఆర్సీకి నమోదు చేసుకోలేకపోయారు.
ఎన్ఆర్సీలో తమ కుటుంబంలోని 8 మంది పేర్లు లేవని జియాఉద్దీన్ కుమారుడు సాజిద్ అలీ అహ్మద్ వెల్లడించారు. కొన్ని రికార్డుల్లో ఎహ్త్రాముద్దీన్ అహ్మద్ పేరు తప్పుగా పలకడమే ఇందుకు కారణమని రిపోర్టులు స్పష్టం చేశాయి.
"మా పేరు జాబితాలో లేకపోవడం ఎంతో బాధ కలిగించింది. మా నాన్న జియాఉద్దీన్ అలీ అహ్మద్.. మా తాత పేరు ఎహ్త్రాముద్దీన్ అలీ అహ్మద్. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు మా తాత తమ్ముడు. నేను ఫక్రుద్దీన్ ముని మనుమడిని. మా తాత పేరు 'అక్రమ్' అని కొన్ని రికార్డుల్లో ఉంది. మా వారసత్వ డేటాను చూశాం. మా ముత్తాత పేరు చూస్తే జల్నుర్ అలీ అహ్మద్ అని ఉంది. జల్నూర్ అలీ అహ్మద్ కుమారుడి పేరు ఎహ్త్రాముద్దీన్ అలీ అహ్మద్ అని డేటాలో ఉంది. పేరును సరిచేయడానికి కోర్టును ఆశ్రయించాం."
-- సాజిద్ అలీ అహ్మద్, ఫక్రుద్దీన్ ముని మనుమడు.
ఓ వ్యక్తి లేదా అతని పూర్వీకులు 1971 మార్చి 24కు ముందే భారత్‌కు వచ్చారని ఆధారాలు చూపిస్తేనే ఎన్ఆర్సీ జాబితాలో పేర్లు ఉంటాయి. ఈ ఆధారాలను మాజీ రాష్ట్రపతి బంధువులు చూపించలేకపోవడం వల్లే ఎన్ఆర్సీ తుది జాబితాలో చోటు దక్కలేదు.
ఇదీ చూడండి:- అసోం ఎన్ఆర్సీపై దేశవ్యాప్తంగా అసమ్మతి స్వరాలు