కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రశాంత్ భుషణ్కు విధించాల్సిన శిక్షపై సుప్రీం ధర్మాసనం ఆగస్టు 31న తీర్పు ప్రకటించనుంది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెల్లడించనుంది.
కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం ప్రశాంత్ భుషణ్కు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష లేదా రెండు వేల వరకు జరిమానాను శిక్షగా విధించే అవకాశం ఉంది. ఒక్కోసారి రెండు కలిపి శిక్షగా విధించవచ్చు.
మళ్లీ ఆలోచించరా.. ప్లీస్!
అయితే ప్రశాంత్కు శిక్ష విధించే అంశాన్ని పునఃపరిశీలించాలని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 122 మంది న్యాయ విద్యార్థులు భారత ప్రధాన న్యాయమూర్తి సహా సుప్రీంలోని ఇతర న్యాయమూర్తులకు లేఖ రాశారు. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా విమర్శలకు సమాధానం ఇవ్వాలని లేఖలో కోరారు. న్యాయ వ్యవస్థపై గౌరవంతో చేసే విమర్శలను కోర్టు ధిక్కారంగా పరిగణించకూడదని విజ్ఞప్తి చేశారు.
భూషణ్ సేవలెన్నో
పర్యావరణ, మానవ హక్కుల పరిరక్షణ సహా పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రశాంత్ భూషణ్ ఎన్నో ఏళ్లుగా కోర్టులో పోరాటం చేశారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాడారని విద్యార్థులు గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో ఆయన అందించిన సహకారం ఆదరణీయమని పేర్కొన్నారు. ప్రశాంత్ చేసిన ట్వీట్లు అణగారిన వర్గాల గళాన్ని వినిపిస్తున్నాయని.. న్యాయవ్యవస్థ పవిత్రతను ఇవి ఏమాత్రం దెబ్బతీయవని అన్నారు. జడ్జిలను న్యాయంగా విమర్శించడం నేరం కాదని వివరించారు.
ఇదీ వివాదం
సుప్రీం న్యాయమూర్తులు, కోర్టులపై ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లను కోర్టు ధిక్కరణగా పరిగణిస్తూ సుప్రీంకోర్టు ప్రశాంత్‌భూషణ్‌ను ఇదివరకే దోషిగా తేల్చింది. దీనిపై క్షమాపణ చెప్పాలని, తన ప్రకటనపై పునరాలోచన చేయాలని ప్రశాంత్ భూషణ్‌కు ఆగస్టు 24వరకు గడువు ఇచ్చింది. తాను క్షమాపణ చెప్పేదిలేదని, సుప్రీం తీర్పుకే కట్టుబడి ఉంటానని ప్రశాంత్ భూషణ్ భీష్మించుకు కూర్చున్నారు. ఆ తర్వాత విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును ఆగస్టు 25న రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి- ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష ఖరారుపై తీర్పు వాయిదా