కేరళలో ప్రఖ్యాతి గాంచిన త్రిస్సూర్ పూరం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పూరం విలంబరం వేడుక వైభవంగా జరిగింది. తెచిక్కొట్టుకవు రామచంద్రన్ అనే పేరు గల ఏనుగు త్రిస్సూర్‌లోని వడక్కుమ్నాథన్ ఆలయాన్ని ఆదివారం తెరవడం ద్వారా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు వేలాది మంది హాజరయ్యారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణలు, వేలాది మంది భక్తుల హర్షధ్వానాల మధ్య ఆలయ దక్షిణ ద్వారాన్ని గజరాజం తెరిచింది. నీతిలక్కవిళమ్మ విగ్రహాన్ని ఏనుగుపై ఊరేగించారు పండితులు. దీంతో వార్షిక పూరం ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయాన్ని తెరిచిన ఏనుగు ఎత్తు పదిన్నర అడుగులు. కేరళలో అత్యంత ఎత్తయిన ఏనుగు ఇదే. ముఖ్యమైన త్రిస్సూర్ పూరం ఉత్సవం నేడు జరుగుతుంది.
ఏనుగుపై వివాదం
2014 నుంచి వివిధ ఉత్సవాల్లో పాల్గొంటూ తెచిక్కొట్టుకవు రామచంద్రన్ అనే ఏనుగు కేరళలో ప్రాచుర్యం పొందింది. ఆ ఏనుగుకు అభిమానులు కూడా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో ఇద్దరిని చంపేసింది ఆ గజం. అప్పటి నుంచి ఈ ఏనుగుపై నిషేధం విధించింది జిల్లా యంత్రాంగం.
అయితే ఏనుగుపై నిషేధం విధించడం పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఏనుగును పూరం ఉత్సవానికి వినియోగించేందుకు త్రిస్సూర్ కలెక్టర్ శుక్రవారం నిబంధనలతో కూడిన అనుమతిచ్చారు. ఓ ప్రభుత్వ వైద్య బృందం ఏనుగుకు అన్ని పరీక్షలు నిర్వహించారు.
ఆ తర్వాత ఆదివారం వేడుకకు ఏనుగును కట్టుదిట్టమైన భద్రత నడుమ తీసుకొచ్చారు అధికారులు, పోలీసులు. ఏనుగు సమీపానికి ప్రజలనెవరినీ రానివ్వలేదు. ఏనుగు తెరిచిన ఆలయ దక్షిణ ద్వారం వద్ద 10 మీటర్ల దూరంలోనే పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు కార్యక్రమం ముగిసిన వెంటనే ఏనుగును తరలించేశారు.
ఇదీ చూడండి : 'మోదీవి తప్పుడు, హాస్యాస్పద వ్యాఖ్యలు'