సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 979 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాత్రి 9 గంటల వరకు పోలింగ్ శాతం 63.43 గా నమోదైంది. పశ్చిమ్ బంగలో అత్యధికంగా 80.35 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ శాతాలిలా ఉన్నాయి.
- పశ్చిమ్ బంగ - 80.35%
- ఝార్ఖండ్ - 65.17%
- హరియాణా - 69.50%
- మధ్యప్రదేశ్ - 64.01%
- దిల్లీ - 60%
- బిహార్ - 59.38%
- ఉత్తర్‌ప్రదేశ్ - 54%
దిల్లీలో ఈవీఎంల మొరాయింపు...
దేశ రాజధాని దిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఉదయం కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.
బంగాల్‌లో భారతీ ఘోష్‌పై దాడి...
బంగాల్లోని 8 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఈ విడతలోనూ రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘటాల్ లోక్ సభ నియోజకవర్గం భాజపా అభ్యర్థి భారతీ ఘోష్‌పై తృణమూల్ కార్యకర్తలు దాడికి యత్నించారు. కేశ్పుర్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టి.. భాజపా వ్యతిరేక నినాదాలు చేశారు.
భారతి మరో పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ ఆమె వాహనశ్రేణిపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులను నివేదిక కోరింది.
బిహార్‌లో మిస్‌ఫైర్...
బిహార్‌లోని 8 నియోజకవర్గాల్లో ఓటింగ్ ముగిసింది. శివ్‌హర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రమాదవశాత్తు కానిస్టేబుల్ వద్దనున్న తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో పోలింగ్ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
ఝార్ఖండ్‌లోని నాలుగు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది.
హరియాణాలో...
హరియాణాలోని 10 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కర్నల్ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ... గురుగ్రామ్‌లో ఓటు వేశాడు.
మధ్యప్రదేశ్...
మధ్యప్రదేశ్‌లోని 8 నియోజకవర్గాల్లో 138 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓటేసిన ప్రముఖులు...
ఆరోదశ పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణితో కలిసి వచ్చి రాష్ట్రపతి భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్మాణభవన్లో ఓటేశారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దిల్లీలోని ఎన్పీ ప్రైమరీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.
కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దిల్లీ ఔరంగజేబ్ రోడ్డులోని పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ దిల్లీ నిర్మాణ్‌భవన్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా లోథి ఎస్టేట్‌లోని సర్దార్ పటేల్ విద్యాలయలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, తూర్పు దిల్లీ భాజపా అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉదయాన్నే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు.
- ఇదీ చూడండి: 'ఎన్నికల పండుగలో మేము సైతం'