ఈ ఏడాది మే లో నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో జరగనున్న తొలి ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర, హరియాణా శాసనసభలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రంతో ప్రచారం ముగియగా, రాజకీయ పార్టీలు చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాయి. హామీలు, తాయిలాలు ప్రకటిస్తూనే విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారాన్ని ముగించాయి. సోమవారం ఓటరు ఇవ్వబోయే తీర్పు కోసం సిద్ధమయ్యాయి.
మహారాష్ట్రలో 288 స్థానాలకు సోమవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా.....3 వేల 237 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 94 వేల 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 కోట్ల 95 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
మరోసారి అధికారంపై భాజపా-శివసేన ధీమా
దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో అయిదేళ్లు మహారాష్ట్రను పాలించిన భాజపా, శివసేన కూటమి మహారాష్ట్రలో రెండోసారి అధికారంలోకి వస్తామని పూర్తి ధీమాతో ఉంది. అయిదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాని నరేంద్ర మోదీ హవా, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు సహా జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడ్డ సానుకూల పరిణామాలు తమ గెలుపునకు దోహదం చేస్తాయని భాజపా, శివసేన కూటమి భావిస్తోంది.
అటు అయిదేళ్ల క్రితం అధికారానికి దూరమైన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కూడా గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, ఇచ్చిన హామీలు తమను విజయ తీరాలకు చేరుస్తాయని ఈ రెండు పార్టీలు నమ్మకంతో ఉన్నాయి.
హరియాణాలోనూ విజయంపై కన్నేసిన కమళదళం
హరియాణాలోనూ ప్రచార పర్వాన్ని పూర్తి చేసుకున్న పార్టీలు సోమవారం జరిగే ఎన్నికలకు సిద్ధమయ్యాయి. 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత ఎన్నికలు జరగనుండగా...1,069 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. కోటీ 83 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 19 వేల 425 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర తరహాలోనే హరియాణాలోనూ రెండో సారి అధికారంపై కన్నేసింది భాజపా. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అవినీతి రహిత పాలన, కేంద్ర రాష్ట్ర, అభివృద్ధి పథకాలు, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై భాజపా ఇక్కడ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది.
ఇక్కడా అయిదేళ్ల క్రితం అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్...గెలుపు ద్వారా తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలనే పట్టుదలతో ఉంది. గతంలో తాము కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నపుడు చేసిన పనులపైనే ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్.
మహారాష్ట్ర, హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈనెల 24న వెలువడనున్నాయి.
ఇదీ చూడండి: గత పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీక పీఓకే: మోదీ