దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మార్కాజ్లో ఈ నెల 1 నుంచి 15 మధ్య జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో పలువురు కరోనాతో మరణించడం కలకలం సృష్టిస్తోంది. తబ్లిగ్-ఏ-జమాత్ అనే సంస్థ ఈ మత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో సుమారు 2000 మంది పాల్గొన్నట్లు సమాచారం. ఇదే ఇప్పడు అందరినీ కలవరపరుస్తోంది.
300 మందికి కరోనా!
నిజాముద్దీన్ ప్రాంతంలోని పలువురికి ఆదివారం రాత్రి నుంచి కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. దీనితో అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు, వైద్య బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అనుమానితులను బస్సుల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు అధికారులు.
నిజాముద్దీన్ సమావేశానికి ఇండోనేసియా, మలేసియా, సౌదీ అరేబియా, కజకిస్థాన్ నుంచి ప్రతినిధులు వచ్చారు. మొత్తంగా 2000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సమాచారం. అక్కడే ఉన్న ఆరు అంతస్తుల డార్మిటరీలో 280 మంది విదేశీయులు ఉన్నట్లు తేలింది.
మొత్తం ప్రతినిధుల్లో 300 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి ద్వారా ఇంకెవరికైనా కొవిడ్-19 సోకి ఉంటుందా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కేసు నమోదు
అనారోగ్యంతో ఉన్న వారి గురించి ఆదివారమే అధికారులకు తెలిపినట్లు ప్రార్థనా స్థలం అధికార ప్రతినిధి చెబుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్డౌన్ నిషేధాన్ని ఉల్లంఘించి, ఒకే చోట వందల మంది ఉన్నందుకు సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో చుట్టు పక్కల ప్రాంతాలను పోలీసులు చుట్టిముట్టి ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇంతవరకు దాదాపు 200 మందిని ఐసోలేషన్‌కు తరలించారు.
క్వారంటైన్ కేంద్రంగా క్రికెట్ స్టేడియం...
దేశరాజధానిలో కేసుల సంఖ్యా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 25 కొత్త కేసులతో.. మొత్తం సంఖ్య 100కు చేరువైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే.. దిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మలచాలని నిర్ణయించింది కేజ్రీవాల్ ప్రభుత్వం.
తెలుగు రాష్ట్రాల్లో కలకలం
నిజాముద్దీన్ ఘటనతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ మత ప్రార్థనల్లో పాల్గొని రావడమే ఇందుకు కారణం. ఇప్పటికే తమ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
మరోవైపు తూర్పుగోదావరి, విజయవాడలో బయటపడిన కరోనా కేసులకు మూలం దిల్లీలోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన ఇరు రాష్ట్రాలు దిల్లీలో ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన వారిపై, వారిని కలిసిన వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించి ఆరా తీస్తున్నాయి.
ఇదీ చూడండి: కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రత్యేక రూల్స్