కరోనా వ్యాప్తిని నియంత్రించే లక్ష్యంతో విధించిన లాక్డౌన్ను మరోమారు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దఫాలుగా మొత్తం 40 రోజుల లాక్డౌన్ అమలు చేస్తున్నా.. కరోనా వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎలా ఉంది? లాక్డౌన్ను కొనసాగించాలా వద్దా వంటి అంశాలపై సీఎంల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
"అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాను. మనం సంయుక్తంగా చేస్తున్న ప్రయత్నాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నాయి. లాక్డౌన్ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని ఫలితాలు కూడా సానుకూలంగా కనిపిస్తున్నాయి. వేలాది మంది ప్రాణాలను రక్షించడంలో సామూహికంగా చేసే ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి. రెండు దఫాలుగా లాక్డౌన్ను అమలు చేశాం. మొదటి దశ లాక్డౌన్ అమలులో వచ్చిన అనుభవాలతో.... రెండోసారి ప్రకటించిన తర్వాత కొన్ని మినహాయింపులు తీసుకువచ్చాము. కరోనాపై పోరులో నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటూ కార్యాచరణ వైపు అడుగులు వేస్తున్నాం. మహాత్మాగాంధీ ఉపాధి హామి సహా కొన్ని పరిశ్రమ పనులు ప్రారంభమయ్యాయి."
- ముఖ్యమంత్రులతో ప్రధాని
కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్డౌన్ కొనసాగుతుందని ప్రధాని వెల్లడించారు. వైరస్ ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో జిల్లాలవారీగా సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన చెందవద్దని సీఎంలకు చెప్పారు.
తొమ్మిదిమందికే మాట్లాడే అవకాశం
లాక్డౌన్ను మరోసారి పొడిగించాల్సిందేనని ప్రధానిని కోరారు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. కరోనాను పూర్తి స్థాయిలో తరిమికొట్టేందుకు ఆంక్షల కొనసాగింపే ఏకైక మార్గమని మోదీకి వివరించారు. మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, పుదుచ్ఛేరి, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, బీహార్, గుజరాత్, హర్యానా సీఎంలకు మాత్రమే మాట్లాడే అవకాశం వచ్చిందని సమాచారం. అందులో నలుగురు ముఖ్యమంత్రులు లాక్డౌన్ను కొనసాగించాలని పేర్కొన్నారని తెలుస్తోంది.
మరోమారు లాక్డౌన్ దిశగానే..
వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో లాక్డౌన్ కొనసాగింపు అనివార్యమని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగింపు దిశగానే కేంద్రం నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఒక్కసారిగా కాకుండా, దశలవారీగా ఆంక్షలను ఎత్తివేయాలన్నది మోదీ సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
ఇదీ చూడండి: ఆ ఆసుపత్రిలో 33 మంది సిబ్బందికి కరోనా