సిక్కుల దశాబ్దాల స్వప్నం కర్తార్‌పుర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. గురునానక్ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు వీసా అవసరం లేకుండా పాక్‌లోని కర్తార్‌పుర్‌లో ఉన్న దర్బార్ సాహిబ్‌ను దర్శించుకునే భాగ్యం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. భారత్ వైపు కారిడార్‌ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సుల్తాన్‌పుర్ లోధి చేరుకున్నారు. బేర్ సాహిబ్ గురుద్వారాలో ప్రధాని ప్రార్థనలు నిర్వహించారు.
మరికాసేపట్లో..
పాక్‌లోని పంజాబ్‌లోని నరోవాల్ జిల్లాలో ఉన్న దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ ఆలయాన్ని కలిపే కర్తార్‌పుర్ కారిడార్‌ను కాసేపట్లో ప్రధాని మోదీ ప్రారభించనున్నారు.
1522 సంవత్సరంలో గురునానక్ దేవ్ కర్తార్‌పుర్ వద్ద సాహిబ్ గురుద్వారాను నెలకొల్పారు. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పూజ్యనీయ స్థలాన్ని వీసా లేకుండా దర్శించుకోవడానికి సిక్కు మతస్థులు దశాబ్దాలుగా ఎదురుచూశారు. చివరికి వారి ఎదురుచూపులు ఫలించి.. కారిడార్ నిర్మాణానికి ఇరు దేశాలు అంగీకరించాయి. పాక్ వైపు కారిడార్‌ను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించనున్నారు.