మానవాళికి పెద్ద సమస్యగా మారిన నీటి కొరతను అధిగమించేందుకు ప్రజలంతా నడుం బిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.'మనసులో మాట' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి రేడియో ప్రసంగం చేసిన ప్రధాని దేశంలోని 130 కోట్ల మంది ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సూచించారు.
దేశంలో ప్రజలు పాటిస్తోన్న పలు జల సంరక్షణ పద్ధతులను మోదీ ప్రస్తావించారు. ప్రజా జీవితంలో నీటి ప్రాముఖ్యాన్ని గుర్తుచేశారు. 'స్వచ్ఛ భారత్'లా జల సంరక్షణ మరో ప్రజాఉద్యమం కావాలని ఆకాంక్షించారు.
"నీటి కొరత వల్ల ఏటా దేశంలోని అనేక ప్రాంతాలు ప్రభావితం అవుతున్నాయి. దేశంలో ఏటా కురుస్తున్న వర్షపు నీటిలో 8 శాతం మాత్రమే పొదుపు అవుతుంది అంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇప్పుడు ఈ సమస్యకు సమాధానం కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది.
జనమంతా కృషి చేస్తే జలసంరక్షణ సాధ్యమే. మన్‌కీ బాత్ ద్వారా ప్రజలకు నేను 3 విన్నపాలు చేస్తున్నాను. జలసంరక్షణ కోసం ప్రజా ఉద్యమాన్ని చేపట్టండి. రెండోది... మన దేశంలో నీటి సంరక్షణకు పలు సంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. వాటిని ఇతరులతో పంచుకోండి. నా మూడో విన్నపం.. జలసంరక్షణ కోసం పాటు పడే వ్యక్తులు, సంస్థలను గుర్తించి...వారి వివరాలు అందరికీ తెలియజేయండి. #JanShakti4JalShakti అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయండి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి