ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదమేనని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. రష్యా ఆధ్వర్యంలో జరుగుతపన్న 12వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్గా ప్రసంగించిన మోదీ.. ఉగ్రవాదం, వాణిజ్యం తదితర అంశాలపై ప్రస్తావించారు.
ఉగ్రవాదానికి మద్దతునిస్తోన్న దేశాలను బాధ్యులను చేయాలని పరోక్షంగా పాకిస్థాన్ను ఉద్దేశించి మోదీ డిమాండ్ చేశారు. ఈ సవాలును సంస్థాగతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో బ్రిక్స్ దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెయిర్ బొల్సోనారో, షీ జిన్పింగ్, సిరిల్ రమఫోసా పాల్గొన్నారు.
ఐరాస సంస్కరణలపై..
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ సంస్కరణలు రావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు మోదీ. వీటితోపాటు ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మార్పులు జరగాలన్నారు.
కరోనా వేళ భారత వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా విషయంలో మానవత్వంతో పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు.
బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికాతో కూడిన బ్రిక్స్ కూటమి.. 360 కోట్ల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. బ్రిక్స్ దేశాల జీడీపీ మొత్తం 16.6 ట్రిలియన్ డాలర్లు.